Adilabad Latest News: ఆదివాసీలను అవమానపరుస్తున్నారని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి గోష్ తీవ్ర ఆరోపణ చేశారు తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్. తమ మనోభావాలను కించపరుస్తూ, ఎలాంటి సమగ్ర విచారణ లేకుండా లంబాడాలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. నిరాధారమైన సమాచారంతో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఆయన్ని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ రోజు కేస్లాపూర్ ప్రజా దర్బార్ లో గోడం గణేష్ మాట్లాడుతూ... లంబాడాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం ఎస్టీ జాబితాలో లేకున్నా, అసెంబ్లీ–పార్లమెంట్ తీర్మానాలు, రాష్ట్రపతి ఆమోదం లేకున్నా గత 50 సంవత్సరాలుగా అక్రమంగా ఎస్టీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని అన్నారు. నిజమైన అడవి బిడ్డలకు చెందవలసిన విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటిలో తీవ్ర అన్యాయం చేస్తూ వస్తున్నారని అన్నారు.

ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలో, ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన సబ్యసాచి గోష్ నిరాధారమైన సమాచారాన్ని కూడగట్టి కోర్టును తప్పుదారి పట్టించారని అన్నారు. నివేదికల రూపంలో కోర్టుకు సమర్పించి, లంబాడాలకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేశారని అన్నారు. లేని దానిని సృష్టించి కోర్టుకు అబద్దాలు చెప్పారని ఆరోపించారు. ఇది న్యాయవ్యవస్థపై దాడిగా అభివర్ణించారు. ఆదివాసీ చట్టాల ఉల్లంఘన, భారత రాజ్యాంగానికి విరుద్ధమైన చర్య అని తీవ్రంగా ఖండించారు.

నిజమైన ఆదివాసీల సాంస్కృతిక, సాంప్రదాయ, సామాజిక విలువలను కించపరుస్తూ, వారి మనోభావాలను గాయపరిచే విధంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా గోడం గణేష్ పేర్కొన్నారు. అదేవిధంగా గోడం గణేష్ కొన్ని డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించారు:

ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు కందకాలు, ట్రెంచులు తవ్వడం తక్షణమే ఆపాలి

రోడ్లు, బ్రిడ్జిలు, కరెంట్ కోసం అవసరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలి

ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలి

ఆదివాసీల కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి బ్యాక్‌లాగ్ పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి

రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి

ఆదివాసీలకు చెందిన పురాతన దేవస్థానాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

రాయల్ కోరి, పద్మాలపూరి, కాకో, గొంది, దండారి వంటి ఆదివాసీ నిధులను వెంటనే విడుదల చేయాలి

మండల, జిల్లా కేంద్రాల్లోని కొమురం భీం కాలనీల్లో నివసిస్తున్న ఆదివాసీలకు ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేసి, ఇందిరమ్మ ఇళ్లు, విద్య, వైద్యం, కరెంట్, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.

ఈ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే, ఆదివాసీ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ బద్ధంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని గోడం గణేష్ విజ్ఞప్తి చేశారు