ACB Raids Civil Supplies DM: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో మహబూబాబాద్ జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ వాసంశెట్టి నరసింహారావును అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ రమేష్‌ ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక బృందాలు ఒకే సమయంలో ఖమ్మంలోని నరసింహారావు నివాసంతో పాటు మహబూబాబాద్, నేలకొండపల్లి, గరిడేపల్లి, హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ సహా మొత్తం ఏడు ప్రాంతాల్లోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల ఇళ్లలో దాడులు చేశారు.

రూ.40 కోట్ల ఆస్తులు

నరసింహారావు తన 15 ఏళ్ల సర్వీసులో దాదాపు రూ.48 లక్షల వరకు ఆస్తులు సంపాదించుకునే అవకాశముందని ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే, దాడుల్లో ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారమే రూ.9.41 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ దాదాపు రూ.40 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఆస్తుల వివరాలు

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బల్లెపల్లి, వెలుగుమట్లలో 5 ఇళ్ల స్థలాలు, ఖమ్మంలో జీ+2, జీ+4 భవనాలు, హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని బైరామల్‌గూడలో జీ+2 భవనం ఉన్నట్లు గుర్తించారు.

సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండలో 21.30 ఎకరాలు, నామవరంలో 5.31 ఎకరాలు, గరిడేపల్లి మండలం కల్మలచెరువులో 1.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు.

సోదాల్లో ఒక కారు, 331.58 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు, రూ.15,600 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య

గతంలో రెండుసార్లు సస్పెండ్

సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన నరసింహారావు 2011లో పౌర సరఫరాల శాఖలో చేరారు. గడిచిన ఆరు నెలలుగా మహబూబాబాద్ జిల్లాలో అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్, డీఎంగా పనిచేశారు. గతంలో ఖమ్మం, నిర్మల్, వరంగల్ జిల్లాల్లో పనిచేసిన సమయంలోనూ ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడమే కాకుండా రెండుసార్లు సస్పెండ్ కూడా అయ్యారు. తాజాగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో బినామీలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రమేశ్ తెలిపారు.

Also Read: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు