Abhinaya on Wedding Rumors: విశాల్‌కు పెళ్లి ఎప్పుడవుతుందో తెలియదు కానీ.. ఎప్పుడూ ఆయన పెళ్లి వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ మధ్య వరలక్ష్మీ శరత్ కుమార్‌తో ప్రేమ, పెళ్లి అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. పెళ్లి పీటల వరకు వెళ్లిన వారి పెళ్లి వ్యవహారం చివరి నిమిషంలో తేడా కొట్టింది. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని ఎవరి పని వారు చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత అనీషా రెడ్డితో విశాల్‌కు నిశ్చితార్థమైంది కానీ, పెళ్లి వరకు మాత్రం పోలేదు. అనీషాతో పెళ్లి వరకు వెళ్లకుండానే కేవలం నిశ్చితార్థంతోనే విశాల్ పెళ్లి ఆగిపోయింది. దానికి కారణాలు ఏంటనేది ఇప్పటి వరకు తెలియలేదు. ఆ తర్వాత కూడా ఒకరిద్దరి పేర్లు విశాల్ పెళ్లి విషయంలో వినిపించాయి. ఏవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కొత్తగా అభినయ పేరు వైరల్ అవుతుంది. త్వరలోనే నటి అభినయతో విశాల్ పెళ్లి అనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై కోలీవుడ్‌లో ఓ మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ‌లో అభినయ రియాక్ట్ అయింది.

నటి అభినయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టుకతోనే మూగ మరియు చెవిటి లక్షణాలతో పుట్టిన అభినయ, నటిగా మాత్రం సూపర్బ్ టాలెంట్‌ని సొంతం చేసుకుంది. నిజంగా ఆమెను చూసినా, ఆమె నటనను చూసిన వారెవ్వరైనా సరే... ఆమెకు నిజంగా వినబడదు, మాట్లాడలేదు అంటే అస్సలు నమ్మరు. అంత గొప్ప నటి అభినయ. కోలీవుడ్‌లో ‘నాడోడిగల్’ అనే సినిమాతో అరంగేట్రం చేసిన అభినయ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించారు. ఒక్క తమిళ్ మాత్రమే కాదు... తెలుగు, కన్నడ, మలయాళం వంటి భాషల్లో కూడా ఆమె గొప్ప నటిగా పేరు సంపాదించుకున్నారు. వాస్తవానికి అభినయ అరంగేట్రం తమిళ్‌లో కాదు... తెలుగులోనే. టాలీవుడ్‌లో ఆమె ‘నేనింతే’ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘కింగ్, సంగమం’ చిత్రాలలో చిన్న పాత్రలలో కనిపించారు. ఈ మూడు సినిమాల తర్వాత ‘నాడోడిగల్’తో తమిళ్‌లో అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత అనేక సినిమాలలో ఆమె కనిపించింది.. కనిపిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు పెళ్లి వార్తలతో మరోసారి ఆమె వార్తలలో హైలెట్ అవుతుంది.

Also Read: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలతో 100 కోట్ల నష్టం... శింగనమల రమేష్‌ బాబుదే తప్పు - నిర్మాత బండ్ల గణేష్ వైరల్ ట్వీట్

తన పెళ్లిపై వస్తున్న వార్తలు, ముఖ్యంగా విశాల్‌తో పెళ్లి అనే వార్తలపై... అందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది అభినయ. విశాల్‌తో పెళ్లి అనే వార్తలను ఆమె ఖండించింది. తనకు ఎప్పటి నుండో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతనితో రిలేషన్‌లో ఉన్నానని అభినయ వెల్లడించారు. ఆ బాయ్‌ఫ్రెండ్‌ మాత్రం హీరో విశాల్‌ కాదని స్పష్టం చేశారు. హీరో విశాల్‌‌తో ప్రేమలో ఉన్నట్టుగా కొన్ని వెబ్‌సైట్స్‌‌లో వచ్చిన వార్తలపై తాజాగా ఆమె వివరణ ఇచ్చారు.

ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ.. ‘‘నాకు, హీరో విశాల్‌ పెళ్ళి ప్రపోజల్‌ చేసినట్టుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తలలో ఏ మాత్రం నిజం లేదు. అలా ప్రచారం ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు. పొట్టకూటి కోసం అలా ప్రచారం చేస్తున్నారని మాత్రం నేను అనుకుంటున్నాను. ఆ వార్తలని నేను పెద్దగా పట్టించుకోవడం లేదు కూడా. నా విషయానికి వస్తే... నేను ఒకరితో రిలేషన్‌లో ఉన్నాను. నాకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నారు. 15 ఏళ్లుగా అతను నాకు తెలుసు. చిన్న వయసు నుంచే మేమిద్దరం మంచి స్నేహితులం. ఆయన మంచి వ్యక్తి. నా విషయాలన్నీ తనకు తెలుసు. మేమిద్దరం అన్ని విషయాలను షేర్ చేసుకుంటాం. మా ఇద్దరి మధ్య ఇంకా పెళ్ళి ప్రస్తావన రాలేదు. దానికి ఇంకా సమయం ఉంది’’ అని అభినయ స్పష్టం చేసింది.

Also Read: ఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంకా చోప్రా మరదలు టాలీవుడ్ హీరోయినే