న్యూఢిల్లీ: భారత్‌లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది చాలా ముఖ్యమైన, ఉపయోగకరమైన విషయం. చాలా కాలం నుంచి చర్చ జరుగుతున్న 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) ప్రక్రియ కార్యరూపం దాల్చుతోంది. ప్రభుత్వం 8వ వేతన సంఘం అధికారిక వెబ్‌సైట్‌ లాంచ్ అయింది. ఉద్యోగులు, ఇతర సంబంధిత వ్యక్తుల నుండి నేరుగా సూచనలు, అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకు మార్చి 16వ తేదీని డెడ్‌లైన్‌గా స్పష్టం చేసింది.

ప్రతి వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో మార్పులను తెస్తుంది. వేతన సంఘం కేవలను జీతాలను పెంచడమే కాకుండా, పెన్షన్లు, అలవెన్సులు, భవిష్యత్తు ఆర్థిక భద్రతపై తమ నిర్ణయంతో నేరుగా ప్రభావం చూపుతుంది. తాజాగా 8వ వేతన సంఘం వెబ్‌సైట్ ప్రారంభం ఉద్యోగులలో ఆశలు రేపుతోంది.

8వ వేతన సంఘం అధికారిక వెబ్‌సైట్ ప్రారంభం

8వ కేంద్ర వేతన సంఘం తన కొత్త, అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇక్కడ పే కమిషన్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. 8వ వేతన సంఘం అధికారిక వెబ్‌సైట్  https://8cpc.gov.in/ ప్రారంభించడం వెనుక ప్రధాన ఉద్దేశం మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, ఉండటంతో పాటు ఉద్యోగులు, సంబంధిత వ్యక్తులను భాగస్వామ్యంగా మార్చడం. ఈ వెబ్‌సైట్‌లో వేతన సంఘానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌లు, నోటిఫికేషన్‌లు, గత వేతన సంఘం నివేదికలు, ముఖ్యమైన డాక్యుమెంట్‌లను చూడవచ్చు.

MyGov పోర్టల్ ద్వారా సూచనలు

8వ వేతన సంఘం సలహాలు, సూచనలు స్వీకరించడానికి MyGov పోర్టల్‌తో జతకట్టింది. కమిషన్ 18 ప్రశ్నలతో ప్రశ్నలను విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగులు, ఇతరుల నుండి అభిప్రాయాలను కోరుతున్నారు. ఈ సూచనల సహాయంతో, వారు తమ తుది సిఫార్సులను మరింత మెరుగ్గా, ఆచరణాత్మకంగా చస్తామని కమిషన్ పేర్కొంది. MyGov పోర్టల్‌లో మాత్రమే సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఏదైనా కాగితంపై పంపిన, ఈమెయిల్ లేదా PDF ద్వారా చేసిన సూచనలు చెల్లవు. సూచనలు ఇచ్చేవారి ఐడెంటిటీ పూర్తిగా సీక్రెట్‌గా ఉంచుతారు.

8వ వేతన సంఘం వెబ్‌సైట్ నుంచి సమాచారం

8వ కేంద్ర వేతన సంఘం అధికారిక వెబ్‌సైట్ ప్రారంభం తర్వాత కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు, సంబంధిత లబ్ధిదారులకు ఒకేచోట నమ్మదగిన సమాచారం లభిస్తుంది. అన్ని తాజా నోటీసులు, ప్రకటనలు, అప్‌డేట్‌లు ఇక్కడ పోస్ట్ చేస్తారు. కమిషన్ పే స్కేల్ విధానం, పెన్షన్లు, అలవెన్సులు, ఇంక్రిమెంట్ సిస్టమ్, సీనియర్ అధికారుల జీతాలపై ఏ సిఫార్సులు చేస్తుందో ఇక్కడ పేర్కొంటారు. వెబ్‌సైట్ నేరుగా MyGov పోర్టల్ ప్రశ్నావళికి యాక్సెస్ లభిస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ సూచనలను నమోదు చేయవచ్చు.

18 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ఇంక్రిమెంట్‌ల తీరు, ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులు, జీతాల నిర్ణయానికి ఆధారం వంటి విధానపరమైన ప్రశ్నలపై 8వ పే కమిషన్ ఉద్యోగుల అభిప్రాయాలను కోరుతోంది. ఈ వెబ్‌సైట్‌లో 6వ, 7వ వేతన సంఘం నివేదికలు, డాక్యుమెంట్‌లు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఏ విధానంగా జీతాల సవరణ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. 8వ వేతన సంఘం ఛైర్మన్, సభ్యులు, కార్యదర్శి, ఇతర అధికారుల సమాచారం పొందవచ్చు.

నోటిఫికేషన్‌లు, ప్రభుత్వ గెజిట్

8వ వేతన సంఘానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ నోటిఫికేషన్‌లు మరియు గెజిట్ నోటిఫికేషన్‌లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడతాయి. సాధారణ ఉద్యోగుల మనస్సుల్లో తలెత్తే ప్రశ్నలకు సమాధానాలు, బకాయిలు ఎప్పుడు వస్తాయి, సిఫార్సులు ఎప్పుడు వస్తాయి, అమలు చేసే ప్రక్రియ ఏమిటి. వీటన్నింటికీ సమాధానం FAQ విభాగంలో లభిస్తుంది. సూచనలు ఇచ్చేవారి గుర్తింపు రహస్యంగా ఉంటుందని, అన్ని ఇన్‌పుట్‌లను సిఫార్సులను రూపొందించడానికి మాత్రమే ఉపయోగిస్తారని వెబ్‌సైట్‌లో స్పష్టం చేశారు. కమిషన్ సమావేశాలు, నివేదికల తయారీ పురోగతి మరియు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం వంటి సమాచారం కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ షేర్ చేయబడుతుంది.